తిరుమల భక్తులకు అలర్ట్. ఇవాళ పలు సేవలు రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మలయప్పస్వామికి ఏటా జ్యేష్ఠ మాసంలో.. జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 19 నుంచి జూన్ 21 వరకు మూడు రోజులపాటు ఈ అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ పలు సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరి ఆ సేవలు ఏంటంటే
జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ అంటే ఇవాళ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు జరిగే జ్యేష్ఠాభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మూడ్రోజుల పాటు జరిగే ఈ అభిషేకంలో మూడో రోజైన ఇవాళ తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు.