వైసీపీ ఎందుకు ఓడిపోయిందో అర్థం కావడం లేదన్నారు కేతిరెడ్డి. ధర్మవరం వైసీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన ఓటమిపై భావోద్వేగ పోస్ట్ చేశారు. తాను, వైసిపి పార్టీ ఏ కారణంతో ఓడిపోయామో అంతు పట్టడం లేదన్నారు. నాన్-లోకల్ వ్యక్తి అయిన సత్యకుమార్ గెలుపొందడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ‘ఈ ఫలితాలు చూస్తుంటే బాధ కలుగుతోంది.
నిజాయితీగా ఉంటే సరిపోదు అనుకుంటా. అబద్దాలు నేను ఆడ లేకపోయాను. ఇది దురదృష్టకరం’ అని పేర్కొన్నారు. కాగా, ‘వైనాట్ 175’….. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే వైసీపీ అధినేత జగన్ ఈ స్లోగన్ అందుకున్నారు. 2019లో 151 సీట్లు గెలిచామని…. ఈసారి కుప్పంతో సహా రాష్ట్రంలోని 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కానీ రియాలిటీ జగన్ అంచనాలకు చాలా భిన్నంగా ఉంది. మొత్తం 175 సీట్లలో వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలిచింది. జగన్ ఆశించిన దానికంటే ఫ్యాన్ పార్టీకి 164 సీట్లు తక్కువగా వచ్చాయి.