ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కొందరూ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఇలా చాలా మంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కూటమిలో చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీలలో పలువురు చేరిపోయారు. తాజాగా వైసీపీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా జనసేనలో చేరారు.
గతంలోనే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఈనెల 3న కుటుంబ సభ్యులతో కలిసి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పెండెం దొరబాబుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.