దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ అర్హత నిబంధనలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. పదేళ్ల కాలపరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్టు తెలిపింది. జీవితకాలంలో ఒకసారే ఉచిత ఇంటిపట్టా ఇచ్చేలా విధివిధానాలు రూపొందించారు. ఇంటిపట్టా ఇచ్చిన రెండేళ్లోపు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్దిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటి స్థలం, సొంతిల్లు ఉండకూడదని నిబంధన విధించింది. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లోనూ లబ్ధిదారుడుగా ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.