సుప్రీంను ఆశ్రయించిన గాలి జనార్దన్.. ఏపీలో మైనింగ్ తవ్వకాలకు సర్కార్ ఆమోదం

-

వివాదాస్పద మైనింగ్‌ వ్యాపారి, కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్దనరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని గనుల్లో మళ్లీ తవ్వకాలు ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తవ్వకాలు ప్రారంభించేందుకు అనుమతివ్వాలంటూ ఆయనకు చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించింది.

కర్ణాటకతో సరిహద్దు అంశంపై స్పష్టత వచ్చినందున, తమ భూభాగంలో తవ్వకాలకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆ నేపథ్యంలో ఓఎంసీ విజ్ఞప్తిని పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఆ కంపెనీపై దాఖలైన మరో కేసును విచారిస్తున్న ధర్మాసనానికి ఈ కేసునూ నివేదించాలని సూచించింది. దానిపై బుధవారం విచారణ జరగనుంది.

గాలికి చెందిన ఓఎంసీ పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. వాటిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. 2009లో ఆ కంపెనీని తవ్వకాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఓఎంసీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించగా, తీర్పు ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చింది. దానిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఒకపక్క ఓఎంసీపై కేసు విచారణ పెండింగ్‌లో ఉండగానే.. తన భూభాగం పరిధిలో తవ్వకాలకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం గమనార్హం.

గనుల్లో మళ్లీ తవ్వకాలకు అనుమతించాలని ఓఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జులై 21న విచారణ జరిపింది. ఆ సందర్భంగా ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దులు నిర్ణయించే ప్రక్రియ పూర్తయిందని, దాన్ని సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదించారని కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలియజేశారు. మ్యాప్‌పై ఏపీ ప్రభుత్వం తరఫున ఇప్పటికే సంతకం కూడా చేసేశారని, కర్ణాటక ప్రభుత్వం ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరిహద్దు వివాదాన్ని లేవనెత్తడం వల్లే గతంలో తవ్వకాలు నిలిపివేశారని, ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారమైంది కాబట్టి మళ్లీ అనుమతివ్వాలని ఓఎంసీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దానిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. కేటాయించిన పరిధిలో తవ్వకాలు జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. సరిహద్దుల్ని నిర్ణయిస్తూ రూపొందించిన మ్యాప్‌పై ఇంకా కర్ణాటక ప్రభుత్వం తరఫున సంతకాలు చేయకుండానే, మైనింగ్‌కు తమకు అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news