వైఎస్సార్ సీపీలో గంటా గుబులు.. రీజ‌నేంటి..?

-

అధికార వైఎస్సార్ పార్టీలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు విష‌యం గుబులు రేపుతోంది. ఆయ‌న త్వ‌ర‌లోనే పార్టీ మారి.. వైఎస్సార్ సీపీ కండువా క‌ప్పుకోబోతున్నార‌ని, ఇలా చేస్తే.. ఆయ‌న వ‌ల్ల ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ‌లో పార్టీపై వ్య‌తిరేక ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఈ జిల్లా నాయ‌కులు తీవ్రంగా క‌ల‌త చెందుతున్నార‌ని అంటున్నారు పరిశీల‌కులు. ఇప్ప‌టికి విశాఖ‌లో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ జోరుగా ఉంది. కీల‌క నాయ‌కులు ఇక్క‌డ విజ‌యం సాధించారు. వీరిలో గంటా ఒక‌రు. విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించారు.

 

దీనికి ముందు అంటే 2014లో భీమిలి నుంచి ఇదే పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యంసాధించి మంత్రిగా చంద్ర‌బాబు హ‌యాంలో చక్రం తిప్పారు. ఎక్క‌డ నుంచి ఏ పార్టీ టికెట్‌పై పోటీ చేసినా విజ‌యం సాదిస్తార‌నే పేరున్న గంటాకు ప్ర‌జ‌ల మాటేమోకానీ, పార్టీల్లో ‌మాత్రం వ్య‌తిరేక‌త ఉండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో టీడీపీలోనూ గంటాకు వ్య‌తిరేకంగా ఓ వ‌ర్గం చ‌క్రం తిప్పేది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న పార్టీలోని నేత‌ల‌ను ఎద‌గ‌నివ్వ‌ర‌ని, మిగిలిన‌వారితో క‌లిసి ప‌నిచేసేందుకు కూడా ముందుకు రార‌ని ప్ర‌చారం ఉంది.

టీడీపీ నేత‌లు గ‌తంలో ఇదే విష‌యంపై చంద్ర‌బాబుకు కూడా ఫిర్యాదులు చేశారు. దీనిపై ఒక‌టికి రెండు సార్లు చంద్ర‌బాబు గంటాను హెచ్చ‌రించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు గంటా పార్టీ మారి.. వైఎస్సార్ సీపీలో చేరితే.. త‌మ‌కు మాత్రం స‌హ‌క‌రిస్తాడ‌నే గ్యారెంటీ ఏంటనేది అధికార పార్టీ నేత‌ల ప్ర‌శ్న‌. అంతేకాదు, ఇలా త‌న అనుకూల‌త కోసం.. త‌న వ్య్పక్తిగ‌త స్వార్థాల కోసం పార్టీలు మారే గంటాను వైఎస్సార్ సీపీలో చేర్చుకుంటే.. ఇప్ప‌టికే సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి పార్టీ కోసం సేవ చేస్తున్న వారిపై వ్య‌తిరేక భావ‌న ప‌డ‌దా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఆచితూచి అడుగులు వేయాల‌ని, పార్టీని బ‌లోపేతం చేసేవారు ఎవ‌రు? బ‌ల‌హీన ప‌రిచేవారు ఎవ‌రు? అనే విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోరుతున్న‌వారు పెరుగుతున్నారు. పైగా గంటాతో ఆయ‌న‌కు మాత్ర‌మే ల‌బ్ధి చేకూరుతుంద‌ని, పార్టీల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నంఉండ‌ద‌ని, ఆయ‌న పార్టీల‌ను భుజాన వేసుకున్న ప‌రిస్థితి గ‌తంలో ఎక్క‌డా లేద‌ని చెబుతున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version