శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లే భక్తులు అన్నప్రసాదాన్ని మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇప్పుడు శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో శుభవార్త చెప్పింది. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందించే అన్న ప్రసాదంలో మసాలా వడను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఇవాళ భక్తులకు వడ ప్రసాదం అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, టీటీడీ ఈవో శ్యామల రావు అధికారికంగా ప్రారంబించారు. ఇప్పటికే శ్రీవారి అన్నప్రసాద మెనులో మసాలా వడను చేర్చింది టీటీడీ. ఇప్పటివరకు కొంత మందికే అందుతుండగా.. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అమలుల్లోకి తెచ్చారు.
టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు మాట్లాడుతూ తాను టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్న ప్రసాద మెనులో భక్తులకు అదనపు వస్తువును వడ్డించే ఆలోచనను ముందుకు తెచ్చానని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఆలోచనలకు అంగీకరించి ఆమోదించారని గుర్తు చేసుకున్నారు. ఆలయ నిర్వహణలో ఇప్పటికే అధిక నాణ్యత గల పదార్థాలతో భక్తులు అన్నప్రసాదాలను అందిస్తున్నట్టు తెలియజేశారు.