రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళవారం జనసేన వీర మహిళలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ జనసేన పక్షాన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీ శక్తిని గౌరవించాలని నేడు మహిళలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన తండ్రి.. రాష్ట్రం కోసం బలిదానం చేసిన మహిళలకు గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు. మహిళలు అదృశ్యమైతే కనీసం ఒక్క సమీక్ష కూడా జరపలేదని మండిపడ్డారు. ఇలాంటి జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం వదిలి పోతామని చాలామంది అంటున్నారని పేర్కొన్నారు. మహిళలపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, మహిళా కమిషన్ మాట్లాడదన్నారు. ఇలాంటప్పుడు దిశా, స్పందన చట్టాలు పెట్టి ఏం ప్రయోజనం అన్నారు.