బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే అవకాశమున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యిందని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి నేడొక ప్రకటనలో తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించినందున వైద్య ఆరోగ్య శాఖ తగు ముందస్తు చర్యల్ని తీసుకుందని ఆమె పేర్కొన్నాను. సంబంధిత జిల్లాల్లో ఉన్న ఎపిడెమిక్ సెల్ లు 24 గంటలూ అందుబాటులో ఉంచడంతో పాటు నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధాకారులకు ఆదేశించామని తెలిపారు.
పునరావాస శిబిరాల వద్ద ఇప్పటికే వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశరాని, ప్రసవానికి వారం రోజుల ముందే గర్భిణిలను ముందుగా నిర్ణయించిన, అన్ని సదుపాయాలున్న ప్రభుత్వాసుపత్రులకు తరలించేందుకు చర్యలు చేపట్టారని ఆమె వివరించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో అక్కడి ఎపిడెమిక్ సెల్ నంబరును ప్రజలకు తెలియజేయాలని, రాష్ట్ర ఎపిడెమిక్ సెల్ నంబరు(9032384168)తో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలు సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆదేశించామని డాక్టర్ పద్మావతి తెలిపారు.