బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరుసగా రెండోరోజూ సోమవారం కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.దీంతో భారీగా వరదనీరు పోటెత్తి రోడ్లు, పొలాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పోర్ట్ మెటియోలాజికల్ (MeT)ఆఫీసుల పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.దీంతో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ కలెక్టర్లు అలర్ట్ అయ్యారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఘాట్ రోడ్లను మూసివేశారు. అనకాపల్లి జిల్లాలోని తాండవ, కల్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దీంతో తాండవ జలాశయం రెండు గేట్లను ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. చెరువులు పొంగి పొర్లడంతో ముందుజాగ్రత్త చర్యగా నర్సీపట్నం-తుని మధ్య రహదారిని అధికారులు మూసివేశారు. అటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.