ఏపీ ప్రజలకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమను తాకాయని, మూడు రోజుల ముందుగానే అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని తెలిపింది. దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు, ఆవర్తనం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉరుములు, పిడుగులు సంభవించే అవకాశముందని వెల్లడించారు.
గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది.