తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి వాన కురుస్తుండగా.. మరోవైపు ఏపీలోనూ కుండపోత వాన కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా ఇవాళ ఉదయం నుంచి పడుతున్న వాన వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు పలు గ్రామాల్లో రోడ్లు బురదమయం కావడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది.
మరోవైపు నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో వర్షానికి మట్టి మిద్దె నానిపోయి కూలిపోంది. ఈ ఘటనలో మద్దమ్మ(50) అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్, హాజీ నగర్ కాలనీల్లోని ప్రధాన రహదారులపై వరద ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా విడపనకల్లు, కూడేరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. కూడేరు మండలం గోటుకూరు పొలాల్లో చీనీ, దానిమ్మ పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.