ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్తను అందించారు హోంమంత్రి అనిత. ఏపీలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబర్ 28 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు.
గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు కూడా వెలువడ్డాయి. వీరిలో తదుపరి దశకు 95,209 అభ్యర్థులు ఎంపికయ్యారు. ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా ఫిజికల్ టెస్టుల కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈవెంట్స్ షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుంది..? పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై క్లారిటీ లేదు.
తాజాగా కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఐదు నెలల్లో శారీరక సామర్ధ్య పరీక్షలు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ లో లభ్యమవుతాయన్నారు. ఐదు నెలల్లో పీఎంటి, పీఈటి పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు. రెండవ దశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష జరుగుతుందని ఆమె ప్రకటించారు.