తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఓవైపు పార్టీలు ప్రచారాల్లో బిజీ అయితే.. మరోవైపు పోలీసులు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదును పోలీసులు సీజ్ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేశారు. అందులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సర్కిల్ సీఐ బాలసురేష్‌బాబు తెలిపారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన సైబరాబాద్ పోలీసులకు తాజాగా దాదాపు 4 వేల లీటర్ల మద్యం పట్టుబడింది. హైదరాబాద్ బాచుపల్లి, పేట్ బషీరాబాద్, బాలానగర్ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.