ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు నాయకులకు నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి) తాజాగా ఓ ఆడియో రిలీజ్ చేశారు. మద్యం కుంభకోణంలో కొన్నాళ్లుగా తనపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. తాను లేనప్పుడు సిట్ అధికారులు ఆఫీసుకు, ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని.. దీనిపై తాను కోర్టుకు కూడా వెళ్లానని తెలిపారు. నిర్ణీత సమయం ఇచ్చి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని వెల్లడించారు.
“లిక్కర్ స్కామ్ కేసులో న్యాయరక్షణ కోసం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాను. కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాను. మద్యం కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు. నాపై ఆయన చేసిన ఆరోపణలపై త్వరలోనే మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడిస్తాను. నా న్యాయపోరాటం పూర్తయిన తర్వాత మీడియా ఎదుట ఆయన చరిత్ర బయటపెడతా’’ అని రాజ్ కసిరెడ్డి అన్నారు.