పేదవారికి పట్టేడు అన్నం పెట్టాలనే ఆలోచనతోనే సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామని.. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలోని నిరుపేదలకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రజా ప్రతినిధులు సన్నబియ్యం లబ్దిదారుల ఇళ్లలో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు.
ఈ తరుణంలోనే ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల పర్యటన సందర్భంగా బూడిదం పాడు గ్రామంలో మంత్రి తుమ్మల సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 3 కోట్ల 10లక్షల మందికి ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తామని.. అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని.. పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు.