జగన్ మోహన్ రెడ్డిని చూసి కాదు, నన్ను చూసి ఓటు వేయమని విజయనగరంలో వీరభద్ర స్వామి కోరినట్లుగా మిగిలిన వారు కోరితే వైకాపాలో ఒకటి, అర నెగ్గే వారు నెగ్గుతారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. వైకాపాలో వీరభద్ర స్వామి గారి వ్యాఖ్యలు విచిత్ర పరిణామంగా చెప్పుకోవచ్చునని, జగన్ మోహన్ రెడ్డి గారు సూపర్… తోపు ఆయన్ని చూసి ఓటు వేయాలని మంత్రి చెల్లుబోయిన వేణు గారు మాట్లాడినట్లుగా మాట్లాడితే అసెంబ్లీ ముఖం కూడా చూడడం కష్టం అని అన్నారు. వీరభద్ర స్వామి గారు లాగా నిజాయితీగా మాట్లాడితేనే ప్రజలు విశ్వసిస్తారని, అప్పుడే వారు విజయవకాశాల రేసులో నిలబడే అవకాశం ఉందని అన్నారు.
శింగనమల రిజర్వ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జొన్నలగడ్డ పద్మావతి గారి పనితీరు బాగాలేదని తీసివేశారని, ఇటీవల పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు గగారికి టికెట్ లేదని చెప్పారని, దీనితో ఎమ్మెస్ బాబు గారు మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి గారు చెప్పినట్లుగానే చేశానని, తాను ఏమి తప్పు చేశానని ప్రశ్నించారని తెలిపారు. అయినా రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు తప్పు చేసే అవకాశం ఉందా?, మీరు తప్పిస్తానంటే ఎలా అన్న జొన్నలగడ్డ పద్మావతి గారు కేవలం రెడ్ల ఓట్లతోనే నెగ్గలేదని, అన్ని కులాల వారు, మతాలవారు మద్దతునిస్తేనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చెప్పారని అన్నారు. గతంలో ఎమ్మెల్యే శ్రీదేవి గారి మాదిరిగానే జొన్నలగడ్డ పద్మావతి గారు కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని విపరీతంగా అభిమానించేవారని, శ్రీదేవి గారు ముందే కళ్ళు తెరిచి మేల్కొనగా ఆలస్యం అయినప్పటికీ పద్మావతి గారు ఇప్పుడు కళ్ళు తెరిచారని అన్నారు.