రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మక్కెలు ఇరగదీస్తారని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. బుధవారం విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బయటకు వచ్చి రధాలు తగలబెడతా, ప్రకాశం బ్యారేజీని కూలగొడతా.. అంటే చొక్కా పట్టుకొని బొక్కలో వేయిస్తానని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎవరైనా నేరాలు చేయాలని చూస్తే వారికి అదే చివరి రోజు అని వార్నింగ్ ఇచ్చారు. నేర చరిత్రతో వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టనని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇక ఎన్టీఆర్ కలెక్టరేట్ లో జరిగిన నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వరద సహాయక కార్యక్రమాలలోనే ఎక్కువ సమయం వెచ్చించానని అన్నారు.
400 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి వచ్చాయని.. వరద సహాయ కార్యక్రమాలలో అధికారులు, మంత్రులు ఓ స్పిరిట్ తో పని చేశారని చెప్పుకొచ్చారు. వరద నీటిలో ఉన్న బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందించే ప్రయత్నం చేస్తామని.. చివరి బాధితుడికి కూడా సాయం అందాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.