ఏపీలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.
కొన్నిజిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, వర్షం కురిసే సమయంలో బయట ఉండకపోవడమే ఉత్తమమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు రానున్న రెండ్రోజులు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, కర్నూలు, ఏలూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వివరించారు.