గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాక్ జైల్లో మగ్గుతున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు బిగ్ షాక్. ఆయనకు అప్పీల్ చేసుకునే హక్కు లేదని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇచ్చిన తీర్పులోని ఓ లొసుగును వాడుకుంటున్న దాయాది దేశం.. ఆయనకు అప్పీల్ చేసుకునే హక్కు లేదని వాదిస్తోంది.
కులభూషణ్ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ హక్కును కల్పించాలని చెబుతూ 2019 జూన్‌లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించాలని.. అప్పటి వరకు అతనికి ఉరిశిక్ష అమలు చేయొద్దని ఆదేశించింది.
2023 మే నెలలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు నిరసనగా జరిగిన అందోళనల్లో పాల్గొన్నారని ఆరోపిస్తూ సైనిక కోర్టులు కొందరిని దోషులుగా నిర్ధరించగా దాన్ని సవాలు చేస్తూ దాఖలపైన పిటిషన్లపై పాక్ సుప్రీంకోర్టులో ఇటీవల విచారణ జరిగింది. ఆ సమయంలో జాదవ్ కేసు ప్రస్తావన రాగా.. అతడికి అప్పీలు హక్కు, అల్లర్ల కేసుల్లో దోషులుగా తేలిన పాక్ పౌరులకు ఇవ్వలేదని వారి తరఫు న్యాయవాది ఆరోపించారు.