దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో దుర్గాదేవికి వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దుర్గమ్మకు అత్యంత భక్తి ప్రపత్తులతో పూజుల చేస్తున్నారు. ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. మరోవైపు తెలంగాణలోని వరంగల్ భద్రకాళీ సన్నిధిలో అమ్మవారి శరన్నవరాత్రులు కోలాహలంగా జరుగుతున్నాయి.
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఇవాళ దుర్గమ్మ వారు..డు శ్రీమహాచండీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఏడాది నుంచే కొత్తగా ఇంద్రకీలాద్రిపై మహాచండీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించినట్లు అర్చకులు తెలిపారు.
దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీమహాచండీ అమ్మవారు ఉద్భవించిందని అర్చకులు భక్తులకు వివరించారు. శ్రీచండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారని.. శ్రీమహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్టేనని చెప్పారు. అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి.. శత్రువులు కూడా మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తారో అవి సత్వరమే నెరవేరతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసమని అర్చకులు తెలిపారు.