అందరినీ డీల్ చేయాల్సిన అధినేతే.. ఇంకా భ్రమల్లో ఉండిపోతే.. తమ్ముళ్లు మాత్రం ఏం చేస్తారు? ఇదీ.. ఇప్పుడు టీడీపీ నేతలు అంటున్న మాట. ప్రస్తుత పరిణామాల్లో వాస్తవాలను గ్రహించి, దానికి అనుగుణం గా వ్యవహరించాల్సిన చంద్రబాబు ఇంకా ఊహల్లోనే విహరిస్తూ.. గతం నుంచి బయట పడకపోవడంపై పెదవి విరిచేవారు పెరిగిపోయారు. తాజాగా విశాఖలో జరిగిన ఎల్‌జీ పాలిమర్స్ ఘటన ప్రతి ఒక్కరికీ కంట తడి పెట్టింది. ఘటన జరిగిన తీరు, తీవ్రత వంటివి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆవేదనకు గురిచేశాయి.
ఇక, దీనిపై వెంటనే స్పందించిన.. కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు రంగంలోకి దిగి.. బాధితులను ఆదుకునేం దుకు ప్రయత్నిస్తున్నాయి. సీఎం జగన్ హుటాహుటిన విశాఖకు వెళ్లారు. ఒకవైపు లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతుండడంతో జగన్ కాలు బయట పెట్టకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే, విశాఖ ఘటనతో చలించిన ఆయన వెంటనే విశాఖకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగానే మృతి చెందిన వారి కుటుంబా లను ఆదుకోవడంలో భాగంగా వారి కుటుంబాలకు ఏకంగా గతంలో ఎక్కడా ఎవరూ ప్రకటించని విధంగా కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.
అదేసమయంలో స్వయంగా తాను బాధితులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తాను చేయాల్సిందంతా చేసింది.
అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు మాత్రం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అదేసమయంలో తాను ఇంకా సీఎం సీటులోనే ఉన్నాననే భావననే ఆయన ప్రదర్శిస్తున్నారు. నేను కానీ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే నేరుగా ప్రమాదానికి కారణమైన పరిశ్రమ వద్దకే వెళ్లే వాడినని చంద్రబాబు అన్నారు.
పరిశ్రమను తక్షణమే మూసివేసి అక్కడి నుంచి తరలించాలని అన్నారు. లాక్‌డౌన్ వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ తప్పిదాలు అనేకం ఉన్నాయన్నారు. కరోనా అంశాన్ని తేలిగ్గా తీసుకోవటం వల్లే ఇప్పుడు రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ పరిణామంతో విశ్లేషకులు నోరెళ్లబెట్టారు. ఎంతైనా బాబు తన తీరు మార్చుకోలేదని విమర్శించారు