గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా.. ఏ పార్టీ అయినా.. ప్రత్యర్థులను నిలువరించే ప్రయత్నం చేయాలి. తన వ్యాఖ్యల ద్వారానో.. లేదా సంబంధింత శాఖ ద్వారానో.. ప్రభుత్వ జోక్యం ద్వారానో.. సదరు వ్యవహారంపై పట్టు సాధించాలి. ప్రత్యర్థులను పక్కన పెట్టాలి. ఇది రాజకీయంగా వ్యూహం. అనాదిగా రాజకీయాల్లో ఇలాంటి పరిణామం మనకు కనిపిస్తూనే ఉంది. అయితే, ఇప్పుడు తాజాగా శ్రీకాళహస్తి నుంచి వైసీపీ తరఫున తొలిసారి విజయం సాధించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి మాత్రం దీనికి వ్యతిరే కంగా వ్యవహరిస్తున్నారు. తన దగ్గర తప్పులు పెట్టుకుని పార్టీని, ప్రభుత్వాన్ని కూడా రోడ్డున పడేస్తున్నారనే వ్యాఖ్యలు, విమ ర్శలు వస్తున్నాయి. ఈ నియోజకవర్గం పరిస్థితిని గమనిస్తే.. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ హవా సాగుతోంది.
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా అయిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఈనియోజకవర్గంలో పాతుకు పోయారు. అయితే, అనివార్య ఆరోగ్య కారణాల రీత్యా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన తన కుమారుడుని రంగంలోకి దింపారు. అయితే, జగన్ సునామీ ప్రభావంతో ఆయన ఓటమి పాలయ్యారు. ఎంత ఓడిపోయినా.. గతం తాలూకు అనుభవాన్ని అప్పుడే వదిలేసుకోడానికి ఏ నాయకుడు కూడా ఇష్టపడడు. తన పట్టును సాధించుకునేందుకు, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని మరీ పైచేయి సాధించేందుకు చూస్తున్నారు. ఇది సహజంగా ఏ నియోజకవర్గంలో అయినా సీనియర్ నాయకుడు ఎవరైనా.. ఏ పార్టీలో ఉన్నా చేసేదే. దీనిని సమర్ధంగా ఎదుర్కొనాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన నాయకుడికి ఉంటుంది. తన హవా చూపించుకునేందుకు, నియోజకవర్గంలో తను పైచేయి సాధించేందుకు సదరు ఎమ్మెల్యే ప్రయత్నించాలి.
కానీ, శ్రీకాళహస్తిలో వైసీపీ తరఫున గెలిచిన బియ్యపు మధుసూదనరెడ్డి వ్యవహారం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. తాను అడు గడుగునా వైఫల్యం చెందుతున్నారనే వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బొజ్జల వర్గాన్ని దీటుగా ఎదుర్కొనడంలో ను, ఆ వర్గాన్ని కట్టడి చేయడంలోను కూడా మధు విఫలమవుతున్నారనేది వాస్తవం. అదేసమయంలో బొజ్జల హయాంలో లబ్ధి పొందిన స్థానిక అధికారులు ఇప్పటికీ బొజ్జల వర్గానికి అనుకూలంగానే ఉన్నారు. వారిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ మధు విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన పదివేల కిలోల బియ్యం పంచడం రగడకు దారి తీసింది. దీనిపై కొందరు అధికారులు(బొజ్జలకు సన్నిహితంగా ఉన్న) మధు వ్యవహారాన్ని రాజకీయం చేశారనే వ్యాఖ్యలు ఉన్నాయి.
ఇలాంటి అంశాల్లో తెలివిగా వ్యవహరించి.. తన పట్టును పెంచుకోవడంలో మధు పూర్తిగా చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏకంగా ప్రభుత్వాన్ని, మంత్రిని టార్గెట్ చేయడం, ప్రక్షాళన అంటూ కామెంట్లు చేయడం వంటివి తెరమీదికి వచ్చాయని అంటున్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఇటీవల నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా రెండు సార్లు గెలిచి.. మంచి పట్టు పెంచుకున్న కురుగొండ్ల రామకృష్ణ.. పైచేయి ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన గత ఏడాది అక్కడ నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రాజకీయంగా సదరు వ్యూహాన్ని అరికట్టే ప్రయత్నం చేశారు. మరి ఇలాంటి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన మధు మాత్రం ఇప్పుడు చతికిలపడి సొంత పార్టీనే ప్రమాదంలోకి నెడుతున్నారని అంటున్నారు పరిశీలకులు.