రాష్ట్రంలోని అధికార వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీల్లో అత్యంత వివాదాస్పద ఎంపీ ఎవరైనా ఉన్నారంటే.. వెంటనే తడుముకోకుం డా చెప్పేపేరు.. నరసాపురం నుంచి విజయం సాధించిన కనుమూరి రఘురామకృష్ణంరాజు. 31909 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. అయితే, ఈ విజయం ఆస్వాదించే లోగానే ఆయన చిక్కులు కొని తెచ్చుకున్నారు. పార్టీలో ఇప్పుడు ఏకా కిగా మారిన ఎంపీ ఎవరైనా ఉన్నారంటే.. ఆయన కనుమూరి మాత్రమే. వాస్తవానికి ఆయన బీజేపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. అయినా కూడా జగన్ ఆయనను నమ్మి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ క్రమంలో జగన్ హవాతో కనుమూరి విజయం సాధించారు. అయితే, వెంటనే ఆయన తనకు కేంద్రంలోనూ సత్తా ఉందని నిరూపించుకునే పనిలో పడ్డారు. ఇదే తీవ్ర వివాదానికి పడిన తొలి అడుగు అంటారు కనుమూరి సన్నిహితులు.
ఎంపీగా గెలిచిన తర్వాత రఘు.. తన ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ వెళ్లారు. వాస్తవానికి తనకు టికెట్ ఇచ్చిన జగన్‌ను కలవాల్సి ఉండగా.. ఆయన జగన్‌ను పక్కన పెట్టి.. ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి.. ఆయనకు కొన్ని పుస్తకాలను బహుమతిగా ఇచ్చి.. ఫొటోలు తీయించుకున్నారు. ఇవి తెలుగు మీడియాలో ప్రముఖంగా వచ్చేలా మేనేజ్ చేసుకున్నారు. ఇది నిజానికి వైసీపీ లైన్‌కు విరుద్ధం. ఒకవేళ మోడీని కలవాలని అనుకుంటే.. జగన్ పర్మిషన్ తీసుకుని ఉండాలి. కానీ, ఆయన చేయలేదు. తర్వాత కూడా పార్టీలైన్‌కు విరుద్ధంగా వ్యవహరించారు.
పాఠశాలల్లో తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. రఘు ఈ విషయాన్ని అనూహ్యంగా పార్లమెంటులో లేవనెత్తి.. తెలుగుపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ పరిణామం.. జగన్-రఘుల మధ్య గ్యాప్‌ను పెంచేసింది. తర్వాత జరిగిన మరో కీలక ఘట్టం మరింతగా రఘును ఏకాకిని చేసింది. హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు వైసీపీ కీలక నేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయసాయి వెయిటింగ్లో ఉండగానే.. తగుదనమ్మా అంటూ.. రఘు ముందు వెళ్లి షాను కలిసి వచ్చారు. దీనిని కూడా స్వయంగా ఆయన హైలెట్ చేసుకున్నారు. ఈ పరిణామాలతో పార్టీ ఆయనను పక్కన పెట్టింది.
ఇక, నియోజకవర్గంలోనూ ఆయన పెద్దగా ప్రజలకు చేరువ కాలేక పోతున్నారు. వైసీపీ నేతలతో నూ సానుకూల పవనాలు లేవు. ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదు. ఆయన కూడా ఎవరితోనూ కలవడం లేదు. తన వ్యాపారాలతోను నిత్యం గడుపుతున్నారు. బీజేపీ నేతలతో మాత్రం టచ్‌లో ఉంటున్నారు. ఇలా తీవ్ర వివాదాస్పదం అయిన ఎంపీ వైసీపీలో ఒక్క రఘుమాత్రమేనని అంటారు వైసీపీ నాయకులు. జగన్ ఒకసారి పిలిచి వార్నింగ్ ఇచ్చినా మారని నాయకుడు కూడా ఆయనే కావడం గమనార్హం. మొత్తంగా ఏడాది పూర్తి చేసుకున్న సమయంలో వివాదాస్పద ఎంపీగా నిలిచిన వైసీపీనాయకుడు రఘు మాత్రమే..!!