ఏపీలోని రాజమహేంద్రవరంలో ఇవాళ్టి నుంచి రెండో అంతర్జాతీయ తెలుగు మహా సభలు జరగనున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ తెలుగు పండగను 5, 6, 7వ తేదీల్లో స్థానిక గైట్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అయిదుగురు గవర్నర్లు, నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ సభలకు హాజరవనున్నట్లు సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, గైట్ విద్యాసంస్థల అధినేత చైతన్యరాజు వెల్లడించారు.
కళాశాల ప్రాంగణంలో రాజరాజనరేంద్రుడి పేరుతో ప్రధాన వేదిక, ఆదికవి నన్నయ, కవి నారాయణభట్టు వేదికలను సిద్ధం చేసినట్లు చైతన్య రాజు తెలిపారు. తొలిరోజు ప్రారంభోత్సవానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. సాయంత్రం 72 మంది తెలుగు వెలుగులు కుటుంబ సభ్యులకు పూర్ణకుంభ పురస్కారాలు ప్రదాన కార్యక్రమం ఉంటుందని వివరించారు.. అదేరోజు ఇతర వేదికలపై కవి సమ్మేళనాలు, సదస్సులు, అష్టావధాన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
6న సాయంత్రం ‘తెలుగు తోరణం’ నృత్యరూపక ప్రదర్శన, విశిష్ట సేవాపురస్కారాలు ప్రదానం చేయనున్నారు. 7వ తేదీన అంతర్జాల వేదికగా కవి సమ్మేళనం ఉంటుంది. రాజరాజనరేంద్రుడికి 1,000 మంది కవులు 1000 కవితలతో నీరాజనం పలికేలా సన్నాహాలు చేస్తున్నట్లు చైతన్య రాజు వెల్లడించారు.