విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 40కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తు న్నారు. నిన్న రాత్రి 11:30 గంటలు దాటిన తర్వాత జీరో నెంబర్ జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి. అయితే.. ఈ విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఓ యూట్యూబర్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్నేహితులతో మందు తాగినట్టు కూడా తెలుస్తోంది. పార్టీలో గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నట్టు పోలీసులు అంటున్నారు. దీనికి అగ్ని ప్రమాదానికి ఏదైనా లింకు ఉందేమో అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. పార్టీ చేసుకున్న యూట్యూబర్ సహా ఆయన స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిని విచారిస్తే తప్ప అక్కడ ఏం జరిగిందనేది మాత్రం తెలియదన్నారు. అందుకే కేసును వారి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.