రాజకీయాల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. పురందేశ్వరిల రాజకీయాలకు పెద్దచిక్కే వచ్చి పడిందని అంటున్నారు పరిశీలకులు. ఈ ఇద్దరు సతీపతులు చెరోపార్టీలో ఉన్నారన్న విషయం తెలిసిందే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అధికార వైఎస్సార్ సీపీలోనే ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఆ పార్టీని వీడలేదు. అయితే.. అంటీ ముట్టనట్టు మాత్రమే ఉంటున్నారు. కానీ, జగన్ దృష్టిలో దగ్గుబాటిని పక్కన పెట్టేశారు. దీనికితోడు ఆయన యాక్టివ్గా ఉండలేక పోతున్నారు. పోనీ.. ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్నైనా రాజకీయాల్లోకి తీసుకువచ్చి.. లైఫ్ ఇద్దామనుకున్నా.. గత ఏడాది ఎన్నికల ఫలితాల అనంతరం .. ఆయన అమెరికాకు వెళ్లిపోయారు.
దీంతో దగ్గుబాటి రాజకీయాలు కూడా మైనస్ అయ్యాయి. ఆయన దూకుడు ప్రదర్శించలేక పోతున్నారు. ఇదిలావుంటే.. దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఆమె కొన్నాళ్లుగా జగన్ సర్కారుగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వరరావుకు జగన్కు చెడిందనే ప్రచారం ఉంది. అంటే.. పురందేశ్వరి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే.. ప్రభుత్వ పార్టీకి చెందిన వెంకటేశ్వరరావు చూస్తూ ఊరుకోవడంపై జగన్ ఫైర్ అయ్యారు. ఇది కూడా దగ్గుబాటి వైఎస్సార్సీపీకి దూరమయ్యే పరిస్థితినే తెచ్చింది. పోనీ.. ఆయనేమన్నా.. భార్యవెంట నడుస్తున్నారా ? అంటే అది కూడా లేదు. ఇక, పురందేశ్వరి విషయం మరింత డోలాయమానంలో పడింది.
గతంలో కేంద్ర మంత్రిగా చక్రం తిప్పిన పురందేశ్వరి.. కాంగ్రెస్ పతనంతో బీజేపీలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే అనేక ఆశలు పెట్టుకున్నారు. కేంద్రంలో పదవో.. లేదా రాజ్యసభ సభ్యత్వమో ఇస్తారని భావించారు. అయితే, ఆమె ఆశలు ఇప్పటి వరకు నెరవేరలేదు. పోనీ.. రాజధాని అమరావతిని అడ్డు పెట్టుకుని పార్టీ డెవలప్ అవుతుందని, దీంతో రాష్ట్రంలో అయినా ఏదో ఒక చోట నుంచి పోటీ చేసి గెలుపుగుర్రం ఎక్కాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అమరావతిపై బీజేపీ యూటర్న్ తీసుకోవడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో పురందేశ్వరి రాజకీయ ఆశలు కూడా పక్కదారి పట్టినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఇలా మొత్తంగా చూస్తే.. దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయాలు దాదాపు ముగిసినట్టేనని చెబుతున్నారు. మరి ఫ్యూచర్ ఏంజరుగుతుందో చూడాలి.