టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొలువుదీరిన తర్వాత తొలిసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య మొదటగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలోనే వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ సభలో ఉండకుండా ఛాంబర్‌కు వెళ్లిపోయారు.
అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి జగన్ ప్రాంగణంలోకి వచ్చారు. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చే వారన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా ఆయన లోపలికి వెళ్లకుండా.. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత వెళ్లారు. తన ప్రమాణస్వీకార సమయం వచ్చినపుడే సభలో జగన్ అడుగుపెట్టారు. ఆ తర్వాత సభలో నుంచి వెళ్లిపోయారు.