రెండో రోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ తిరుపతి బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షేకావత్, అమిత్ షా ను జగన్ కలిశారు. మూడు రాజధానుల అంశం, శాసన మండలి రద్దు ప్రక్రియ వేగవంతం చేయడంతో సహా, కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న పలు అంశాల మీద అమిత్ షా తో చర్చలు జరిపారు. అంతర్వేది ఘటన, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం పై సీబీఐ దర్యాప్తు జరపాలని అమిత్ షా ను జగన్ కోరారు.
అలానే అమరావతి భూ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులపై కోర్టులు స్టే ఇవ్వడం ,దర్యాప్తు ను అడ్డుకోవడం లాంటి అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళారు. ఇక సీఎం తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుమలలో ప్రముఖులతో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే పలువురు మంత్రులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే తిరుమలకు జిల్లా ఇంచార్జ్ మంత్రి గౌతమ్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణలు చేరుకున్నారు. ఇక ఇప్పటికే జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి,పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారు. ఈ మధ్యాహ్నంకు తిరుమలకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, హోం మంత్రి సుచరితలు తిరుమల చేరుకోనున్నారు.