ఏపీలో దోచుకుని..తెలంగాణలో బతుకుతున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి కష్టం రానివ్వను.. వైఎస్ఆర్ మత్స్య కార భారోసాలో ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు అందించామని తెలిపారు.
వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం మత్స్యకార కుటుంబాలకు ఉపయోగ పడుతుందని వివరించారు సీఎం జగన్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మేలు చేయాలన్న తపనతో పని చేస్తున్నానని తెలిపారు. ప్రతి అనగారిన కుటుంబాన్ని, సామాజిక వర్గాన్ని నా కుటుంబం అనుకుంటున్నా.. పేదలకు మేలు జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీలు తట్టు కోలేక పోతున్నాయని చెప్పారు సీఎం జగన్. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు పేదలు గుర్తుకువస్తారు.. గత పాలనలో ఎస్సీలకు, బీసీలకు అన్యాయం జరిగిందని ఆగ్రహించారు. నేను చేసిన మంచిని, ప్రజలని, దేవుడిని నమ్ముకున్నా.. చంద్రబాబు, దత్త పుత్రుడు పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు నమ్ముకున్నారని వివరించారు సీఎం జగన్.