కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని బాబుకు తెలుసు.. అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగదీశారు. బడ్జెట్ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చాయి. బడ్జెట్ చూస్తే బాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తుందన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 4 నెలలు మాత్రమే ఉంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ లో ఆ మేరకు నిధులు కేటాయించే వారు. ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉందని తెలిపారు. ఏపీలో శ్రీలంక అవుతుందని చంద్రబాబు మాట్లాడారు. దత్తపుత్రుడు ఏపీ అప్పు రత్న అనే బిరుదు ఇచ్చారు. ఇప్పుడు అప్పు రత్న అనే బిరుదు ఎవ్వరికి ఇవ్వాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు వదినమ్మ పురందేశ్వరి, దత్త పుత్రుడు వత్తాసు పలికారని గుర్తు చేశారు. అప్పు రత్న అనే బిరుదు చంద్రబాబుకు ఇవ్వాలని సెటైర్లు వేశారు.