జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తరలివెళ్లి ఆయన రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పులు, కేసులు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు పొందుపరిచారు. అయితే ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పవన్ కల్యాణ్ గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు.
ఐదేళ్లలో ఆయన సంపాదన రూ.114,76,78,300 ఉండగా.. ఇందుకు ఆదాయపన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీ కింద రూ.26,84,70,000 చెల్లించినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అప్పులు రూ.64,26,84,453గా ప్రకటించిన పవన్ .. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46.70 కోట్లు అని వివరించారు. వివిధ సంస్థలు, జనసేన పార్టీ నిర్వహించిన సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం రూ.17,15,00,000 విరాళం అందించినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. వివిధ సంస్థలకు రూ.3,32,11,717ల విరాళాలు అందచేశారు.