భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈరోజు మాత్రం ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, రేపు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బుధ, గురు వారాల్లో కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు తమతో పాటు గొడుగు, టోపీలు లాంటివి పెట్టుకోవాలని చెప్పారు. ఎండల వేడిమికి శరీరంలోని నీరు వేగంగా ఆవిరైపోతుందని కాబట్టి ఎక్కువసార్లు మంచినీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.