టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి రిమాండ్ గడువును డిసెంబర్ 11 వరకు పొడిగిస్తూ సోమవారం కడపలోని జిల్లా కోర్టు ఇన్ చార్జి మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేశారు. వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఈ నెల 14న అరెస్టు అయిన బీటెక్ రవిని అదే రోజు రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు.
ఈ క్రమంలో సోమవారం ఆయనకు పోలీసులు కడప కోర్టులో హాజరుపరిచారు. ఇన్చార్జ్ మెజిస్ట్రేట్ మరో 14 రోజులపాటు రిమాండ్ ను పొడిగించారు. కాగా, బెయిల్ పిటిషన్ పై జరగాల్సిన విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఇది ఇలా ఉండగా.. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు.
ఈ సందర్భంగా లోకేష్ కు స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప విమానాశ్రయం ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయనకు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దాదాపు పది నెలల తర్వాత వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ తరుణంలో బీటెక్ రవి అరెస్ట్ అయ్యారు.