తిరుమల శ్రీవారి ఆలయంలో తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని టీటీడీ అధికారులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఉత్సవాలకు ముందు మంగళవారం రోజున తిరుమంజనం చేయడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
ఏటా ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తామని శ్యామల రావు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, ఆలయ గోడలు, ఆలయ పైకప్పు, దేవత మూర్తులు, పూజ సామాగ్రిని శుద్ధి చేశామని తెలిపారు. మూల మూర్తిపై వస్త్రం కప్పి సుగంధ ద్రవ్యాలతో ఆలయ మొత్తం సంప్రోక్షణ చేసినట్లు వెల్లడించారు. అనంతరం మూలమూర్తికి ప్రత్యేక పూజలు, నివేదనలను అర్చకులు సమర్పించారని వివరించారు. ఉగాది పర్వదినాన భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.