భద్రాద్రి శ్రీసీతారామ స్వామి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీరామ నవమి వేళ భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కన్నులపండువగా జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే రామయ్య కళ్యాణానికి మీరు వెళ్లలేకపోతున్నారా? అయినా సరే పవిత్రమైన రాములవారి తలంబ్రాలు మీకు కావాలా? మీకోసమే తెలంగాణ ఆర్టీసీ ఓ సరికొత్త కార్యక్రమం తీసుకువచ్చింది. ఏప్రిల్ 6వ తేదీన భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణోత్సవ తలంబ్రాలను మీ ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే ఓ ఆసక్తికర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దేవాదాయ శాఖ సహకారంతో స్వామివారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు తెలంగాణ ఆర్టీసీ చేరవేయనుంది. రాములవారి తలంబ్రాలు కావాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. అంతే.. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేస్తారు. ఆర్టీసీ వెబ్‌సైట్ http://tgsrtclogistics.co.inలో ఆన్‌లైన్ బుకింగ్‌తో పాటు కాల్ సెంటర్ నెంబర్లు 040-69440069, 040- 69440000ను సంప్రదిస్తే.. నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారు.