విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడుతోందని అన్నారు. ప్రజల సొమ్మును అప్పనంగా తన అస్మదీయులకు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ గతంలో చేసిన పీపీఏ లను జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రద్దు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తికి మారుపేరు అయిన ఏపీ జెన్కోని నిర్వీర్యం చేసి.. ప్రజావసరాల కోసం అనే పేరుతో యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడిచిన ఐదేళ్లలో చేసిన విద్యుత్ కొనుగోళ్లలో జగన్ సర్కార్ ఎక్కడా పారదర్శకత ప్రదర్శించలేదని మంత్రి గొట్టిపాటి అన్నారు. విద్యుత్ కొనుగోళ్లను క్విడ్ ప్రోకో విధానం ద్వారా జరిపి, వచ్చిన ప్రజల సొమ్ము అంతా తాడేపల్లి ప్యాలెస్ తరలించారని ఆరోపించారు. కేవలం విద్యుత్ కొనుగోళ్లు మాత్రమే కాకుండా బొగ్గు కొనుగోళ్ల వ్యవహారం అంతా కూడా రహస్యంగానే జగన్ రెడ్డి, పెద్దిరెడ్డిలు నడిపించారని స్పష్టం చేశారు. వీరు అనుసరించిన విద్యుత్ విధానాల పాపమే నేడు ప్రజల మెడలకు సర్దుబాటు చార్జీల ద్వారా చుట్టుకుందని గొట్టిపాటి విమర్శించారు.