కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఫస్ట్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఆ తర్వాత?

-

కూటమి ప్రభుత్వం కొలువుదీరాక అసెంబ్లీ మొదటి సమావేశానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌ హోదాలో సభాపతి స్థానంలో ఆశీనులై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించనున్నారు. 

ఉదయం 9 గంటల 46 నిమిషాలకు సభ ప్రారంభం అవుతుంది. వెంటనే అసెంబ్లీ కార్యదర్శి ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సభాపతి స్థానానికి ఆహ్వానించగా.. సభాపతి స్థానంలో కుర్చున్న తరువాత తొలుత సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రమాణం చేయిస్తారు. ఆ తరువాత వరుసగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.

గంటకు సగటున 25 మంది సభ్యుల ప్రమాణం చొప్పున 7 గంటల పాటు ఈ ప్రక్రియ సాగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలిరోజే దాదాపు సభ్యులందరి చేత ప్రమాణం చేయించే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. వివిధ కారణాల వల్ల ఎవరైనా తొలిరోజు సభకు రాలేకపోయినా, ప్రమాణం చేయలేకపోయినా వారితో శనివారం ఉదయం సభ తొలి సెషన్​లో ప్రమాణం చేయిస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news