గతేడాది కంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే భారత్ లోకి ప్రవేశించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు మూడు రోజులు ముందే ప్రవేశించి రాష్ట్రమంతటా విస్తరించాయి. కానీ ఇప్పటికీ తెలంగాణ, ఏపీల్లో సరిపడా వర్షాలు కురవలేదు. వారంలో ఒకటి రెండ్రోజులు అది కూడా ఓ గంటపాటు మోస్తరు వర్షం కురుస్తోంది తప్ప పెద్దగా వానలు పడినా దాఖలు లేవు. దీంతో రైతుల్లో గుబులు మొదలైంది.
ఏపీలో నైరుతి ప్రవేశించినప్పటి నుంచి ఒకటి, రెండు ప్రాంతాలు మినహా.. ఎక్కడా చెప్పుకోదగ్గ వానలు లేవు. పైగా రాష్ట్రమంతటా వేడి అల్లాడిస్తోంది. మే నెలలో ఉన్నట్లుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మరో ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడితేనే వర్షాలు కురిసి.. వాతావరణం చల్లబడుతుందని చెబుతున్నారు. రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.