ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందు తనకు తాను రాజుగా ప్రకటించుకుని, ఇప్పుడు భగవంతునిగా మారుతున్న పరిణామ క్రమంలో ఎవరికి వారు తమ భవనాలకు ప్యాలెస్ అని పేరు పెట్టుకుంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ రఘురామ. అందుకే ప్యాలెస్ యజమానులకు 22A కింద నోటీసులు జారీ చేశారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.
విశాఖపట్నంలో గాది రాజు ప్యాలెస్ కు 22 A కింద నోటీసులు జారీ చేయడంపై రఘురామకృష్ణ రాజు గారు స్పందిస్తూ… గాది రాజు కళ్యాణ మండపం అని పేరు పెట్టుకుంటే సరిపోయేదని, ప్యాలెస్ అని పేరు పెట్టుకోవడం వల్లే ఈ తిప్పలు వచ్చాయని, ప్యాలెస్ అని పేరు పెడితే రాజులు ఊరుకుంటారా?, అందుకే నోటీసులు జారీ చేసి ఉంటారని అన్నారు. ఇప్పటికైనా గాదిరాజు కళ్యాణ మండపం అనో, లేనిపక్షంలో వై. యస్ రాజశేఖర్ రెడ్డి కళ్యాణ మండపం అని పేరు పెడితే ఉపశమనం లభిస్తే లభించవచ్చునని అన్నారు. రుషికొండపై 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో రాజు ప్యాలెస్ నిర్మించుకున్నప్పుడు, కింద మరొకరి పేరిట ప్యాలెస్ ఉంటే, ఆ రాజు సహిస్తారా? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.
అయినా స్థానిక పాలెగాన్ని కలిసి మంచి రేటు వస్తే ఇచ్చేయడం మంచిదని.. లేకపోతే మరో మూడు నెలల పాటు తన ఆస్తిని కాపాడుకోగలిగితే, ఆ ఆస్తి ఆయనకే దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సతీమణి జన్మదిన వేడుకలకు విశాఖకు తరలి వెళ్లాలని ఆయన భావించారని, అది కుదరలేదని, ఇప్పుడు ఆయన జన్మ దినోత్సవానికైనా విశాఖకు వెళ్లాలనుకున్న వారి ఆశలపై అమరావతి రైతు పరిరక్షణ సమితి ప్రతినిధులు న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్ ) దాఖలు చేసి నీళ్లు చల్లారని అన్నారు.