తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు ను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తున్న నారా లోకేష్… రేపు ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడుతో పాటు నివాసంలో భువనేశ్వరి నిరాహార దీక్ష చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వారి మద్దతుగా నారా లోకేష్ ఢిల్లీలోని ఎంపీ కనకమెడల రాజేందర్ నివాసంలో దీక్ష చేస్తారు. నారా లోకేష్ తో పాటు టిడిపి ఎంపీలు పాల్గొంటారు.
కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ అధికారులు నిన్న నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నోటీసుల అంశంపై స్పందించారు. “సీఐడీ అనేది వైసీపీ అనుబంధ విభాగంగా మారిపోయింది. లేని కేసులు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను తీసుకువచ్చి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అనేదే లేదు… కానీ పెద్ద కుంభకోణం జరిగినట్టు చిత్రీకరిస్తున్నారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.