ఏపీకి మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ పురర్ వ్యవస్థీకరణకు కట్టుబడి ఉన్నామని మోదీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల సహాయం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. అలాగే, నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో భాగంగా పోలవరానికి పెద్ద పీట వేస్తున్నట్టు వెల్లడించారు.
పోలవరం త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించామన్న నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం 4శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యంతో సాగుతున్నామని తెలిపారు. ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఎంఎస్‌ఎంఈ, మధ్యతరగతి కేంద్రంగా బడ్జెట్ ఉందని వెల్లడించారు. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.