దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన ₹100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకమని.. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని.. ఎన్టీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
స్మారక నాణెం విడుదల ఎన్టీఆర్‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తనయ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణతోపాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.