తెలుగు రాష్ట్రాల్లో కరోనా భారీ విధ్వంసం సృష్టిస్తోంది. ఏపీలో రోజూ పది వేలకు చేరువలో కేసులు నమోదు అవుతుండగా భారీగానే మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణాలో కాస్త తక్కువే అయినా ఇక్కడి కేసుల సంఖ్య కూడా ఎక్కువే నమోదు అవుతోంది. ఈ వైరస్ ఇప్పుడు వరుసగా ప్రముఖులకి కూడా సోకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు, నేతలు ఈ వైరస్ బారిన పడగా ఇప్పుడు ఈ వైరస్ ఒక నేతను బలి తీసుకుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ టీడీపీ నేత, చంద్రబాబుకు సన్నిహితుడని పేరున్న పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా వైరస్ కాటుకు బలయ్యారు. గత కొద్ది రోజుల క్రితం ఈయనకు కరోనా సోకగా ఆయన్ని హైదరాబాదు యశోదా ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుండి ఈ మహమ్మారితో పోరాడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. పాలెం శ్రీకాంత్ రెడ్డి 2009 ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే 2014లో బయటకొచ్చిన ఆయన మనపాలన అనే పార్టీ పెట్టారు. రాయలసీమ అభివృద్ధి తన లక్ష్యం అని చెప్పుకునే ఆయన మోడరన్ రాయలసీమ డెవలెప్మెంట్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు.