నేడు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 2,445 నూతన ఆలయాల నిర్మాణం చేపడతామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే 97 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రి ఆధునీకరణ, 40.50 కోట్లతో ప్రైవేట్ ఏజెన్సీ చేతికి వ్యర్ధాల నిర్వహణ, 9.5 కోట్లతో తిరుపతిలో సెంట్రలైజ్డ్ గోదాం, 7.44 కోట్లతో టీటీడీ పరిధిలో ఆధునిక కంప్యూటర్లు, 4.16 కోట్లతో అదనపు లడ్డు కౌంటర్ల నిర్మాణం వంటి పలు కీలక తీర్మానాలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్ట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వై వి సుబ్బారెడ్డి. బోర్డు సభ్యులు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ కి వచ్చిన విరాళాల సాయంతో దేశవ్యాప్తంగా 2,450 ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ కు వచ్చిన విరాళాలు, చేసిన ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.