ఇటీవల వారాహి విజయ యాత్రలో భాగంగా పిఠాపురంలో జరిగిన సభలో వైసిపి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంట్లోకి వైసిపి గుండాలు వచ్చి దోచుకుంటారని.. హంతకులు, గుండాలు, రౌడీలు, అవినీతిపరులతో వైసిపి ప్రభుత్వం నిండిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. వైసిపి గుండాలకు నిలయమని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ కళ్యాణే పెద్ద రౌడీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన లో ఉన్న వాళ్లంతా రౌడీలు, గుండాలేనని అన్నారు. పవన్ కళ్యాణ్ పైనే రౌడీ కేసులు ఉండొచ్చన్నారు. తనపై చరిత్రలో ఒక్క కేసు ఉందో చూపించాలని సవాల్ విసిరారు. జనసేనలో రౌడీ కాని వ్యక్తి పేరును పవన్ కళ్యాణ్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పుడు మాటలు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని పవన్ కళ్యాణ్ కి హితవు పలికారు మంత్రి బొత్స సత్యనారాయణ.