అగ్నిపధ్ విధానం పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. భారత సాయుధ దళాల్లో 4 ఏళ్ల స్వల్పకాలిక ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం తీసుకువస్తున్న అగ్నిపధ్ విధానం తీవ్ర హింసకు దారి తీస్తుంది. ఆర్మీ ఆశావాహులు నిరసనలకు దిగుతూ.. పలు రైళ్లకు నిప్పంటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు ఓ రైలును అగ్నికి ఆహుతి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటనలో మూడు ఎక్స్ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు దహనం అయ్యాయి.
రైల్వే స్టేషన్ కు చెందిన పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందారు. మరి కొందరు యువకులు గాయపడ్డారు. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఘటనలు దురదృష్టకరమని అన్నారు.
అగ్నీపధ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానం పై చేపట్టిన ఈ నిరసన నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని తెలిపారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి జనసేనాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.