ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్ంలో పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు చేపట్టారు. మూడో విడత వైఎస్‌ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆయన కుప్పంలో ఇవాళ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా 2,500 మంది వరకు పోలీసు సిబ్బంది పట్టణంలో అడుగడుగునా మోహరించారు.
సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగానే ఇప్పటికే కేసులు నమోదైన తెదేపా నాయకులు, కార్యకర్తలకు సమన్లు ఇచ్చారు. విజయపురం, కార్వేటినగరం మండలాల తహసీల్దార్ల ముందు గురువారం వారు హాజరయ్యారు. దీనికితోడు నియోజకవర్గంలో క్రియాశీలంగా ఉన్న తెదేపా కార్యకర్తలను గురువారం ఉదయంనుంచే గృహనిర్బంధంలో ఉంచారు.
పట్టణ సమీపంలోని హెలిప్యాడ్ నుంచి సభాప్రాంగణం వరకు రోడ్డును మధ్యలో తవ్వి బారికేడ్లు ఏర్పాట్లు చేయడంతో పట్టణంలో రాకపోకలు సాగించే వాహనదారులు అవస్థలు పడ్డారు. మరోవైపు దుకాణాలకు వెళ్లేందుకు దారి లేక రెండు రోజులుగా వ్యాపారాలు సరిగా లేవని వ్యాపారులు వాపోతున్నారు. జగన్ వెళ్లాక రోడ్డు మధ్యలో ఉన్న గుంతలను ఎవరు పూడ్చుతారోననే చర్చ పట్టణంలో సాగుతోంది.
హెలిప్యాడ్ నుంచి సుమారు నాలుగు కి.మీ.మేర బ్యానర్లు, ప్లెక్ల్సీలను వైకాపా శ్రేణులు ఏర్పాటుచేశాయి. సీఎం సభకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు బస్సులు ఇవ్వాలంటూ ఆ పార్టీ నాయకులు ముందుగానే మాట్లాడుకున్నారు. గురు, శుక్రవారాలు కుప్పం మండలంలోని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.