ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. చిత్ర పరిశ్రమకు చంద్రబాబు ఎంతో చేశారని, కానీ, ఆయన అరెస్టు అయినప్పుడు చిత్ర పరిశ్రమ స్పందించలేదనే వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. చంద్రబాబు నాయుడి అరెస్టు చాలా సున్నితమైన విషయమని వివరించారు. చిత్ర పరిశ్రమ రాజకీయ, మతపరమైన అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేయదని స్పష్టం చేశారు. అందుకే చంద్రబాబు అరెస్టుపై కూడా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదని వివరించారు.
చిత్ర పరిశ్రమ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనే తాను అనుకుంటానని సురేష్ బాబు అన్నారు. రాజకీయంగా ప్రకటనలు ఇవ్వడం మంచిది కాదని తెలిపారు. తాము రాజకీయ నాయకులం కాదని, లేదా మీడియా వాళ్లం కాదని చెప్పారు. తాము సినిమాలు నిర్మిస్తామని అన్నారు. కాబట్టి, చిత్రపరిశ్రమ రాజకీయ ప్రకటనలు ఇవ్వడం మంచిది కాదనే అనుకుంటానని వివరించారు. ముఖ్యమంత్రులు చాలా మంది చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడ్డారని సురేష్ బాబు అన్నారు. చెన్నారెడ్డి గారు చాలా హెల్ప్ చేశారని, ఆ తర్వత ఎన్టీఆర్ చేశారని వివరించారు. చంద్రబాబు కూడా చిత్ర పరిశ్రమకు చాలానే చేశారని తెలిపారు. అలాగని, చిత్ర పరిశ్రమ స్పందించడం లేదని కామెంట్ చేయడం సరికాదని వివరించారు. చంద్రబాబు అరెస్టు చాలా సున్నితమైన ఇష్యూ అని, ఆంధ్రా, తెలంగాణ గొడవలప్పుడు కూడా చిత్ర పరిశ్రమ స్పందించలేదని గుర్తు చేశారు.