ఏపీ విద్యార్థులకు షాక్..బటన్ నొక్కినా లబ్ధిదారులకు అందని డబ్బులు…!

-

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కినా లబ్ధిదారులకు డబ్బులు అందడం లేదని, వచ్చిన వాడికి వచ్చినంత అన్నట్లుగా పరిస్థితి తయారయ్యిందని, బటన్ నొక్కుడు అంతా దొంగనొక్కుడేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. విద్యా దీవెన బకాయిలే 465 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, కాలేజీలలో చదువుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిన విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి డబ్బులు వేస్తారట అని, ఇప్పటికే డబ్బులు అందని 22 కాలేజీలు కేసులు వేశాయని తెలిపారు.

కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులు తాళలేక తమ కాలేజీలను మూసివేస్తున్నాయని, కాలేజీ విద్యాభ్యాసాన్ని ముగించుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లిపోయిన విద్యార్థుల తల్లుల అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తే, వారు కాలేజీలకు ఫీజులు ఎందుకు చెల్లిస్తారని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. ఓట్ల కొనుగోలు కోసమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్లోకి డబ్బు జమ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అమ్మి అయినా సరే, మళ్లీ తామే అధికారంలోకి రావాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవాలన్నదే జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యమన్నారు.

జనాలు వారి బ్రతుకులు వారు బతుకుతారని మద్యం తాగేవారు భార్యల మెడలలోని పుస్తెలు అమ్ముకొని అయినా తాగుతారని, ఇసుక తవ్వకాలు, మైనింగ్, మద్యం ద్వారా నికర ఆదాయం లభిస్తుందన్న అంచనాకు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారన్నారు. గంజాయిని కూడా అధికారికంగా తమ పార్టీ నాయకులు సాగు చేయడం మొదలుపెట్టినట్లు తెలిసిందని అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా బటన్ నొక్కిన ఇప్పటికీ 1750 కోట్ల రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో జమ కాలేదని, అయినా లబ్ధిదారులు చకోర పక్షుల్లాగా డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారని, తమకే డబ్బులు రానప్పుడు, కాలేజీకి ఫీజు ఎందుకు కడుతామని విద్యార్థుల తల్లులు భావిస్తుండగా, ఫీజులు అందక కాలేజీ యాజమాన్యాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని అన్నారు. అయినా లబ్ధిదారులు మాత్రం మా జగన్ బాబు మూడు నెలల తర్వాత అయినా బాకీలు తీరుస్తాడనే ఆశాభావంతో ఉంటే, రోజులు గడిచిపోతున్నాయి కానీ బాకీలు మాత్రం పెరిగిపోతున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news